దిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దుమారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబరు 27న బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష జరగాలని, బహిరంగ బ్యాలెట్ విధానంలో ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఈలోగా ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని, బలపరీక్ష ఒక్కటే అజెండాగా సమావేశం జరగాలని సూచించింది. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం బలపరీక్షను ప్రొటెం స్పీకర్ నిర్వహించాలని ఆదేశించింది. అంతేగాక.. బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిలో రాజ్యాంగ నైతికతను అన్ని పక్షాలు కాపాడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఎదుట సోమవారం వాదనలు ముగిశాయి. దీంతో నేడు తీర్పు వెలువరించింది.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో భాజపా 105 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనకు 56, కాంగ్రెస్‌కు 44, ఎన్సీపీకి 54 సీట్లు వచ్చాయి. మరో 29 చోట్ల చిన్న పార్టీలు, ఇతరులు గెలుపొందారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో కలిసి పోటీ చేసిన శివసేన ఫలితాల తర్వాత భాజపాతో విబేధాలు రావడంతో కూటమి నుంచి విడిపోయింది. అనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకుని ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో భాజపా సర్కార్ ఏర్పడింది. దీంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు సుప్రీం తలుపుతట్టాయి.
సుప్రీం తీర్పు నేపథ్యంలో రేపు బలపరీక్ష జరగనుంది. ఈ సందర్భంగా పార్టీల బలాబలాలను పరిశీలిస్తే.. ఎన్సీపీ, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో తమకు 170 మంది సంఖ్యాబలం ఉందని భాజపా చెబుతోంది. అయితే శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ త్రయం కూడా తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పింది. సోమవారం ఈ మూడు పార్టీలు సంయుక్తంగా సమావేశమై.. 162 మంది ఎమ్మెల్యేలతో బలప్రదర్శన చేశాయి.
అజిత్ విప్ జారీ చేస్తారా..
ఇదిలా ఉండగా.. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకొన్నారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా అజిత్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో అజిత్‌కు విప్ జారీ చేసే అవకాశం ఉందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. మరి బలపరీక్షలో భాజపా నెగ్గుతుందో.. ఎన్సీపీ ఎమ్మెల్యేల ఓటు ఎటో తెలియాలంటే రేపటిదాకా ఆగాల్సిందే.