5 లక్షల బడ్జెట్‌లో దూసుకొస్తున్న టాటా కొత్త కారు: హార్న్‌బిల్.


టాటా మోటార్స్ సరికొత్త హెచ్2ఎక్స్ కారును సిద్దం చేసింది. హార్న్‌బిల్‌ పేరుతో టాటా మోటార్స్ ఈ హెచ్2ఎక్స్ కాన్సెప్ట్ మోడల్‌ను ఈ ఏడాది మార్చిలో జరిగిన 2019 జెనీవా మోటార్ షో లో తొలిసారిగా ఆవిష్కరించింది. దీనిని ప్రపంచ వేదిక మీద ప్రదర్శించినప్పటి నుండి ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. టాటా హెచ్2ఎక్స్ (హార్న్‌బిల్) ఇండియన్ మార్కెట్లోకి పరిచయమయ్యే సమయం రానే వచ్చింది. అవును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌ పోలో టాటా హెచ్2ఎక్స్ మనముందుకు రానుంది.



సరికొత్త హెచ్2ఎక్స్ (హార్న్‌బిల్) కారును టాటా వారి ఆల్పా ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు కాబట్టి వీల్ బేస్ పొడవుగానే ఉంటుంది. టాటా మోటార్స్ కథనం మేరకు, జెనీవాలో ఆవిష్కరించిన హెచ్2ఎక్స్ కాన్సెప్ట్ మోడల్ 75 శాతం ప్రొడక్షన్ వెర్షన్‌లో ఉందని చల్లటి కబురు చెప్పింది. అంటే రోడ్డు మీదకు వచ్చే అసలైన హెచ్2ఎక్స్ కారు 75 శాతం వరకు ఇప్పుడు మనం ఫోటోలో చూస్తున్న మోడల్‌నే పోలి ఉంటుంది.


జెనీవా మోటార్ షో 2019 లో అంతర్జాతీయ ప్రదర్శనకు వచ్చిన టాటా హెచ్2ఎక్స్ కారులో స్ల్పిట్ హెడ్ ల్యాంప్ డిజైన్, భారీ పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్, అతి పెద్ద వీల్ అర్చెస్ మరియు పానరొమిక్ సన్‌రూఫ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే ఇవన్నీ ప్రొడక్షన్ వెర్షన్‌లో వస్తాయా రావో అనేది ప్రశ్నార్థకం.



టాటా హెచ్2ఎక్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే, చాలా వరకు సింపుల్ ఇంటీరియర్ డిజైన్ కలిగి ఉంటుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా ఎన్నో టెక్నాలజీ కనెక్టెడ్ ఫీచర్లు రానున్నాయి.



సాంకేతికంగా టాటా హెచ్2ఎక్స్ (హార్న్‌బిల్‌) కారులో బిఎస్-6 ప్రమాణాలను పాటించే 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ రానుంది. 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఈ ఇంజన్ టాటా టియాగో బిఎస్-4 మోడల్‌లో ఉంది.అతి త్వరలో మార్కెట్లోకి రానున్న టాటా హెచ్2ఎక్స్ లేదా హార్న్‌బిల్ ప్రారంభ ధర రూ. 4.75 లక్షల నుండి 5.75 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉండవచ్చు. ఇది మార్కెట్లో ఉన్న మారుతి ఇగ్నిస్ మరియు మహీంద్రా కెయువి100 మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.



డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం! టాటా హెచ్2ఎక్స్ చూడటానికి చాలా కొత్తగా ఆకర్షణీయంగా ఉంది. మార్కెట్లో ఉన్నవాటితో పోలిస్తే అరుదైన డిజైన్ అన్ని చెప్పకోవచ్చు. టాటా నుండి ఇలాంటి మోడల్స్ ఇప్పుడే మార్కెట్లోకి వస్తుండటంతో ప్యాసింజర్ కార్ల మార్కెట్లోకి తనకంటూ ఒక మార్కును ఏర్పరుచుకుంటోంది. టాటా డిజైనింగ్ అండ్ డెవలపింగ్ టీమ్ ఎంతో వేగంగా ఈ మోడల్‌ను అభివృద్ది చేసి, విడుదలకు సిద్దం చేసింది. టాటా హెచ్2ఎక్స్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే ఏ మాత్రం డౌట్ లేకుండా టాటా సేల్స్ అమాంతం పెరిగిపోతాయని చెప్పవచ్చు.